అతడేవో పూజలు చేస్తుంటే
నిద్రమత్తు వదలి నిశ్శబ్దంగా
అలా తిలకిస్తూ ఉందొక చెట్టు
ఏంచేస్తున్నా డబ్బా అనుకుంది 1
నలుగురిని వెంటబెట్టుకు వచ్చి
గోతులు తీస్తుంటే కలతపడింది
తనకాళ్ళు నరికేస్తారేమో నని
కంగారుపడి పోయిందా చెట్టు 2
తనని నరికిపోగులు పెట్టకుండానే
మనిషి ఒక యిల్లు కట్టుకున్నాడు
తనప్రక్కనే ఉండటం మొదలెట్టాడు
సందడికి సంతోషపడిందా చెట్టు 3
అతడు రోజూ పలుకరిస్తున్నాడు
చెట్టుకు వయసు పెరుగుతోంది
మనిషి వయసూ పెరుగుతోంది
అతడు తనకోసం రావటం తగ్గింది 4
అతడితో వాడి కొడుకు వచ్చేవాడు
వాడి పెరిగేవేగం ముచ్చట గొలిపేది
ఇపుడు ఇద్దరూ రావటం మానేసారు
తండ్రి యిల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు 5
చెట్టుకు చాలానే బాధ కలిగిందప్పుడు
కానీ ఏమీ బయటకు చెప్పలేదు కదా
ఐనా కొడుకును చూసి సంబరపడింది
ఇల్లు పెద్దదిగా చేయటం మొదలెట్టాడని 6
ఔరా అభిమానం లేని కొడు కేం చేసాడూ
ఆయింటి వైపుగా అభిమానంతో చాచిన
తన కొమ్మలను అంతలోనే నరికించేసాడు
ఎంతో ఘోరం కానీ తానేంచేయగలదు 7
చెట్టుకు చాలానే బాధ కలిగిందప్పుడు
కానీ ఏమీ బయటకు చెప్పలేదు కదా
ఐనా కొడుకును క్షమించింది ప్రేమతో
ఉన్న కొమ్మలే నాకు చాలులే అనుకుంది 8
చిన్న యింటికి అంతస్థులు పెరిగాయి
పెరిగిన దాని దర్జాను చెట్టూ మెచ్చుకుంది
మన యిల్లెంత బాగుందిప్పుడూ అనుకుంది
దరిజేరి ఆడే కొడుకు కొడుకుల్నీ మెచ్చింది 9
ఏళ్ళని మరికొన్ని పచ్చని చెట్టు చూసింది
ఆపిల్లలు పెద్దలవటమూ తాను చూసింది
ఇంటికి కొంత వార్ధక్యం రావటం చూసింది
పెద్దాయన కొడుకు పోవటమూ చూసింది 10
ఇంకా ఏమేం చూడాలో కదా అనుకుంది
ఆ యింటిలో సందడి తగ్గటం చూసింది
ఈమధ్య కొత్తవాళ్ళ కదలికలు చూసింది
ఎవడో తనకేసి వేలు చూపటం చూసింది 11
ఉన్నట్లుండి ఇంటిని కూల్చటం చూసింది
అయ్యో అయ్యో అనుకుంటూ చూసింది
కానీ ఏమీ బయటకు చెప్పలేదు కదా
ఎంత బాధనైనా భరించి చూస్తూనే ఉంది 12
ఆ అందమైన యిల్లు మాయమై పోయింది
తన ప్రియమైన యిల్లు మాయమై పోయింది
యింటి మనుషులెప్పుడో మాయమయ్యారు
చెట్టు ఎదురుగా అంతా శూన్యమైపోయింది 13
అంతలోనే మరలా మనుషులెవరో వచ్చారు
చెట్టుకు కొంచెంగా ఆశ చిగురించసాగింది
పెద్దపెద్ద యంత్రాలు కూడా తరలి వచ్చాయి
మళ్ళీ యిల్లొస్తుందని చెట్టు పొంగిపోయింది 14
అవును పెద్ద యిల్లే వచ్చేలా కనిపించింది
గోతులు చాలా లోతుగానే తీస్తున్నారు కదా
చెట్టుకు చాలా సంబరంగా అనిపించింది
పెద్ద యిల్లు పెద్ద సందడి అని మురిసింది 15
ఉన్నట్లుండి చెట్టు కాళ్ళు చురుక్కు మన్నాయి
జరుగుతున్నది చెట్టుకు అర్ధమై విలపించింది
ఆ పెద్ద యింటికై తనను బలి యిచ్చేస్తున్నారు
మూగగా రోదిస్తూ నేలకు ఒరిగిపోసాగింది 16
18-4-2026



Chettu antha vaadu ainaa chettu anubhavam ravali ante Tara taralu ni pujinchali.
Chettu vale satpurushudu kaagaladu.