ఇంత అల్ల రెందుకురా ఇన్ని యాట లెందుకురా
సంతతోద్యద్దయా మా కంతు పట్ట కున్నదిరా
గోవింద విలపించెడు కుందరదనలను చూడుము
నీవారము కామా మానేరమేమి వ్రజసుందర
భావజశతకోటికోటిపరమసుందరాకార
దేవదేవ కృపామయా తెలియరార దాగనేల
వ్రేతలపై నీకెందుకు ప్రీతి దప్పినది నేడు
ఆతురలము మమ్ము విడిచి యందందున దాగేవే
మూతి బిగియించి నీవు పొన్నచెట్టెక్క నేల
చేతిలోని మురళినూద చిత్తమేల రాదు నీకు
యమునాతటసైకతవిహారభూములను నీవు
విమలగాంధర్వహేల వెలయించుటలు మాని
అమాయికల గోపికల నారడిపెట్టే విదేమి
అమలినశృంగారరసమహార్ణవ గోపాలకృష్ణ
(74)
24-4-2026


